Home / భాష-సాహిత్యం / పక్షి : కంచర్ల సుబ్బానాయుడు

పక్షి : కంచర్ల సుబ్బానాయుడు

ఆకాశంలో పులుగు
రంగుల పూల వంతెన కడుతుంది
కోటి హరివిల్లుల్ని
ఒక్క లుక్కులో క్లిక్ మనిపిస్తుంది
గగనంలో రెక్కలు చాచి
యోగా చేసే మాస్టారు ఔతుంది
అప్పుడప్పుడు
ఎల్లలు ఎరుగని వ్యోమగామియై
కులమతాలకు అతీతంగా
కపటమెరుగని రెక్కల కాషాయ
దుస్తుల స్వామీజీయై
వాయులీల ప్రదర్శన లిస్తుంటుంది
చిన్న పిచ్చుక గూడువంటి
పొదరిల్లు పొదుపుకు చిహ్నం
గిజిగాని గూడు చూస్తే అది
ఏ కల్పనా నైపుణ్యం నేర్పిన
శిల్పకారుని హస్త
లాఘవమో తెలియదు కానీ
ఇక్కడ
చూపరుల కళ్ళకు
అది దర్పణ మౌతుంది
టికెట్టు లేని ప్రయాణం
దానికి భగవంతుడిచ్చిన ఫ్రీకార్డు
రెక్కలురాని
పిల్లపక్షుల నోటికి ఆహారాన్ని
అందించే ఆ అనుభూతిని
పరికిస్తే…
మనం కూడా పక్షులమైతే
ఎంత బాగుండో అన్నతలంపు
మెదడు కుదుళ్ళలో వెన్నెలై
ఒక్క సారి
తుళ్ళింత… మనసంతా – జాలువారేది పక్షి.
పక్షి…
పుణ్యజీవి
ధ్యాన ముద్ర వహించగల ధన్యజీవి.
అందుకే..
మన ముంగిలి రంగు రంగుల
విహంగాల విడిది చేద్దాం!
పక్షి జీవితం
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు – నిజమైన చిహ్నం!
పక్షి ఆగమనం..
సర్వ మం(మ)త శాంతి సౌభ్రాతృత్వానికి నిదర్శనం..
అదే.. పక్షి నుంచి
సదా మనం నేర్చుకోవాల్సిన సందేశం..
శాంతి సందేశం
అదే.. నిత్య సత్యమైన (నా) గీతా సారాంశం.

_/_ కంచర్ల సుబ్బానాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *